Sunday 23 December 2012

Telangana -- December 23 2009

‎"ఈ దీర్ఘ కవనం.. నాలో పుట్టిన భావ విస్పోటనం.. నాలుగు కోట్ల గుండెల నిరంతర తెలంగానం.."
ఆగష్టు 15 1947.. భారతదేశానికి అమృతం కురిసిన రాత్రి
డిసెంబరు 23 2009.. అదే భారతదేశ రాజ్యాంగానికి తూట్లు పడ్డ రోజు
అరకప్పు చాయ్ లో "డిసెంబర్ 9" రాత్రిని యదతీరా ఆస్వాదిస్తున్నప్పుడు... తెలంగాణ గొంతులో తెగిపడ్డ విషపు చుక్క "డిసెంబర్ 23"

ఆ రోజుకు మనసు లేదు, మానవత్వం లేదు
మాట తడి ఆరింది, మనిషితనం చచ్చింది
ఆ రోజు చరిత్రలో చీకటి రోజు
సూర్యున్ని మబ్బులు కమ్మి పగలంతా చిమ్మ చీకట్లో దిగపడింది
దశాబ్దాల కల నేలవేరినట్లే సాకారమై అదృశ్యమైన రోజు.....

వెనుకంజ లేదంటూ, ముందంజ కాదంటూ
వ్యతిరేకానికి సైయ్యంటు, అనుకులానికి నైయ్యంటు
నపుంసక రాక్షసులు దిష్టిబొమ్మల్లా తలకిందులా వ్రేలాడారు
తెర వెనుక స్వార్ధ పరుల సమైక్యపు అడుగులు
తెరముందు బానిసకొక బానిసల చేతకానితనం
అంతా పారదర్శకమే... అంతా జగన్నాటకమే..
ఇదో దుర్దినపు దుఖ:క్రీడ, అదో నీచ కీచక వలస పీడ..!!

రెండు నాలుకల ధోరణులు, పులిమిన మాటలతో
గుండెగూడు రక్తంతో చిద్రమయింది
దేహం తీరని ఆవేశంతో దహించుకుపోయింది
మెదడు తరగని ఆలోచనలతో తరించుకుపోయింది..!!
తలకు ఉరేసుకుంటేనో, రైలుకెదురెల్లి గుద్దుకుంటేనో,
శరీరాన్ని ఆగ్నికి ఆహుతిస్తేనో, కటిక విషాన్ని మింగితేనో,
మనసుకు విశ్రాంతినివ్వని విక్రాంతినివ్వని రోజది..!!

చూపు ఒక్కటే - కండ్లు రెండు
నినాదం ఒక్కటే - నాలుకలు రెండు
వాయి ఒక్కటే - దేహం మూడు
ఎవడికి వాడు తలల్ని మొలల్లో దోపుకుని
జెండాల్ని నిస్సిగ్గుగా పక్కకుబెట్టి
ఒకే ఒక్క ఎజెండా మీద ఊరెగితిరి గదా!!
శత్రువులు కుడా మిత్రులైతిరి కదా !!
నుదుటి మీద ముద్దులై, మనసు మనసూ ఆలింగనం చేసుకున్తిరి గదా!!

విశాఖ ఉక్కు, కోస్స్తాంధ్ర కారిడార్ ఆంధ్రుల హక్కయినట్టే
తెలంగాణ నినాదాన్ని తొక్కిపట్టి సమైక్యాంధ్ర అనే అబద్ధం
కుడా ఆంధ్రుల హక్కంటిరి కదరా !!
భారతమాత యవనికపై తెలుగోడి సిగ్గు దీస్తిరి కదరా!!

పచ్చ చొక్కోడు, తెల్ల పంచోడు
మొలతాళ్ళు మొలల్లో ఎగతోపుకొని మగాల్లోలె
అసెంబ్లీలో బిల్లు పెట్టమని, తీరా బిల్లు వస్తే
పట్ట పగలు పగటి వేశాగానోలె
ఎంగిలి విస్తరై ఎగిరిపోతిరి కదరా!!
దోపిడీ పెత్తనం చేజారి పోతుందని
పేగుబంధం ఒక్కటై తిరిగితిరి కదరా!!
ఇన్నాళ్ళు గల్లీ నుండి డిల్లీ వరకు
అబద్దాల పుట్టలలో పాములా దాక్కోని
కాలకూట విషాన్ని కక్కితిరి కదరా!!

ఐదు దశాబ్దాలా మీ సహవాసం మాకు అరణ్యరోదనైంది
మీ తోడు మా నీడను, ఉనికిని మింగింది
మీ రెండున్నర జిల్లాల యాస, మా ఆట మాట పాటలను కమ్మింది
మా పంట పొలాల్లో, మీ రియల్ ఎస్టేట్ కలుపు మొక్కయ్యింది
మా రాజధాని వాకిట్లో, మీ స్టూడియోలు దిష్టిబొమ్మలయ్యాయి
మా వక్ఫ్ భూములు, మీ ల్యాంకో కావూరి హిల్సయ్యాయి
సెక్రటేరియట్లో చక్రం తిప్పేది మీరు,
మీ కారు స్టీరింగు తిప్పే డ్రైవర్లమ్ మేము..!!

ఇంకేక్కడిదిరా నీకూ నాకూ బంధుత్వం
ఇదేనా నువ్వు నా గొంతులో నొక్కే అన్నాదమ్ముల రక్త సంబంధం
నీతో ఐదు దశాబ్దాల సహజీవనం..
అనైతికం ఒడ్డున ఒక జారుడు మెట్టయ్యింది
నీ మనస్సాక్షిగా చెప్పు ఒకే తల్లి బిడ్డలమేనా మనం ?
నువ్వు ముక్కుసూటిగా చెప్పు ఒకే గూటి పక్షులమేనా మనం ?
నేను నిలబడ్డ నేల నాది కాకుండా పోయింది
నా తెలంగాణ నీకు అక్షయపాత్ర అయితే
ఇక్కడి భూమిపుత్రులు నీకు బిచ్చగాండ్లు అయిండ్రు..!!

ఓ వలసాంధ్ర మీడియా ప్రతినిదుల్లారా,
నా ఆంధ్ర కవి, కళాకార మిత్రుల్లారా
ఇంతకాలం ఈ నేల తల్లి
నీ కీర్తులకు, వ్యాపార సామ్రాజ్యాలకు పునాదులయ్యింది
నీవు మాత్రం ఈ భూమి పుత్రులకు పరాయివాడై పోయావేం !!
నీ రంగు డబ్బాల్లో, చలనచిత్రాల్లో
నా నిజాన్ని తొక్కిపట్టి, నీ అబద్ధానికి పట్టం కడుతున్నావు
నా తెలివిని తొక్కి పట్టి, నీ పైత్యానికి ఎక్కుపెడుతున్నావ్..!!

ఎక్కడో రాలిన తుఫాను చావుల్ని, తాగుడు మరణాల్ని
ఈ నేల మీద నిల్చొని గర్జిన్చినవాడ !!
నా విద్యార్ధుల పోరాటాలు, నా యువకుల మండిపోయిన దేహాలు
నా జాతి స్వేచ్చా గీతాలు, నా తెలంగాణ వీర గాధలు
నీకు కనిపించవు, వినిపించవు !!
అక్షరాన్ని కవాతు చేయించాల్సిన ఓ వలసాంధ్ర కవీ..
పదాల్ని తూటాలుగా మార్చాల్సిన ఓ గాయకుడా...
నీ నాలుక మడత పడిందెమ్ ??
నీ ఆత్మ హననం చేసుకున్నావెం ??

భారత దేశ చరిత్రలోనే ఓ గొప్ప మలుపు వస్తాంది
ఈ చారిత్రాత్మక ఘట్టంలో..మీ గళాన్ని.. మీ కలాన్ని..
మీ సాహిత్యాన్ని.. మీ రంగు డబ్బాలను..
ఎవరి కోసమో తేల్చుకోండి..!
అర్ద శతాబ్దపు వలస పాలనలో నిరంతర దోపిడీకి గురై
ఆశయాసులైన పీడితుల కోసమా...
లేదా.. పీడితుల పొట్ట కొట్టి సమైక్య వాదం పేరిట
4 కోట్ల జనాలను పీడించుకొని తిన్నదరగక ఒల్లు బలిసిన
గుప్పెడు స్వార్ధ పరుల కోసమా.. తేల్చుకోండి మీరు...!

ప్రపంచం లోకి ప్రజలు వస్తున్రు
ప్రజా పోరాటాలు నిర్మాణం ఐతున్నయ్
రాజుల సామ్రాజ్యాలే కులిపోతున్నాయ్
400 ఏండ్ల నిజాం సామ్రాజ్యాన్నే పెకిలించినం
ఉసిల్ల పుట్టలై..బతుకమ్మ పాటలై..
ఒగ్గు డప్పులై..బాల సంతల గంటలై..
ఎముకల సప్పుడై..తీన్ మార్ దెబ్బలై..
తుడుం మోతలై..అమర వీరుల స్వప్నాలై.. మోగుతున్న
ఈ ఆత్మగౌరవ పోరాటానికి మోకాలద్దేయ్యకండి
మీ కోటలకు బీటలు వారే రోజులు దగ్గర పడ్డాయ్....!!!!

ఓ నా తెలంగాణా యువ తేజ కిషోరమా..
నీకు ధిక్కార స్వభావం తల్లి కడుపులోంచే వచ్చిందని గుర్తించు
ప్రస్థానంకి ఎప్పుడు ముందు చూపే, జ్ఞాపకానికి మాత్రం వెనక
తల్లి కడుపులోకి మళ్ళీ పోలేంగా
కానీ ఆ పేగు బంధం ఈ పెగుతో పెనవేసుకుని పోతుంది
విశ్వ యవనికతో భూమి శృతి కలిపినట్లు....

ఈ మోసాలు, రాజకీయ నీచ కీచక క్రీడలు,
శవాల మీద పెలాలేరుకొనే ద్రోహులు,
అంకెల గారడీ అయిన డిల్లీ సింహాసనం
ఇవేమీ మనకు కొత్త కాదు ....
గత దశాబ్ద కాలం అలుపెరగని ఉద్యమంతో
ఎవడి మొఖం ఎవడిదో తెలిసివచ్చేట్లు చేసాం...
ప్రత్యర్ధి గారడీ విద్యలు సైతం మానసికంగా
సిగ్గుపడేట్లు చేసిన సందర్భంలో ఉన్నాం..!!

ఈ సమయం తెలంగాణది
ఈ సందర్భం తెలంగాణది
మన అక్షరం మనకుంది, మన ఆయుధం మనకుంది
ఇవ్వాళ తెలంగాణ ఒంటరిది కాదు,
నాలుగు కోట్ల పాదాల కవాతు సవ్వడి !!
అందరం నిరాశల చీకట్లను పడమటి దిక్కులో వదిలి
ఆశయాల పొద్దు పొడుపులతో
తూర్పు సరిహద్దు రేఖ మీద నిట్ట నిటారుగా నిలుచుందాం..
అంతిమ విజయంకోసం కలిసికట్టుగా నిలబడుదాం..
అది సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా..!!

మళ్ళీ తల్లికి పురుటి నొప్పులు తప్పని రోజొస్తుంది
చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది
మన రహదారి పోరుదారువతుంది
మన ఉద్యమం మళ్ళీ విజ్రుమ్భిస్తుంది..!!

ఓ తెలంగాణ మిత్రమా.. అపజయాలు మాత్రమే బహువచనం..
సంకల్పం ఒక్కటే....
ఆత్మ గౌరవం ఒక్కటే...
విజయం కుడా ఒక్కటే...!!

సమైక్యం తలనరికే ఖడ్గం "డిసెంబర్ 9"
మళ్ళీ పునరుత్దానమవుతుంది
తెలంగాణలో అమృతం కురిసే రాత్రి మళ్ళీ వస్తుంది
ఆ తల్లి కడుపున ఉన్న శిశువు "డిసెంబర్ 9"
మళ్ళీ బతికొస్తుంది..ముమ్మాటికీ మళ్ళీ బతికొస్తుంది..!!

పాపం నశించుగాక.. ధర్మం జయించుగాక..!!
జై హింద్.. జై తెలంగాణ ... జై జై తెలంగాణ

--
నిశాంత్

No comments:

Post a Comment