Saturday 11 May 2013

గులామీ చోడో, గులాబీ బనో


సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న, సీమాంధ్ర పెట్టుబడిదారీ దుర్మార్గ రాజకీయాలకు, కుట్రలు, కుహకాలకు వ్యతిరేకంగా ఒకసారి ఉధృతంగా, మరోసారి శాంతంగా ఉద్యమిస్తున్నది. సీమాంధ్ర పాలకవర్గాలు చివరికి తెలంగాణ సంస్కృతిపై కూడా దాడి చేసి, తాము తెలంగాణ వారమనే స్పృహను సైతం కోల్పోయే విధంగా తెలుగుజాతి అనే మిథ్యా భావనను ప్రవేశపెట్టి తెలంగాణవాదమనే సహజమైన భావనపై అన్ని రకాలుగా దాడి చేశాయి. ఎంత చేసినా, ఏమి చేసి నా తెలంగాణ ప్రజలు తాము ‘ఆంవూధవారు’గా పిలువబడానికి ఇష్టపడలేదు. 

తెలంగాణ ఉద్యమంలో రెండు ప్రధాన ధోరణులను మనం గమనిస్తున్నాము. ఒకటి మితవాదమార్గం. వీరు తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యమని, సీమాంధ్ర పాలక వర్గాల బలా న్ని ఉద్యమం ఎదుర్కొని ఓడించడం సాధ్యంకాదని నమ్ముతారు. తామూ జై తెలంగాణ అం టూ ఉద్యమం ముందుకుపోకుండా ఆటంకపరుస్తారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహలు వ్యాపింపజేసి, చీలికలు తెచ్చి, ఉద్యమమైనా, ఎన్నికలైనా తెలంగాణను ఓడించడానికి ప్రయ త్నం చేస్తారు. వీరు ప్రధానంగా తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను, దాని నాయకుడైన కేసీఆర్ పై దాడి చేసి అవిశ్వాస, గందరగోళం వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేస్తారు.

 
రెండవది అతివాద మార్గం వీరు ప్రజలతో సంబంధం లేకుండా నినాదాలు ఇస్తారు. ఓపిగ్గా ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా నిరంతర ఉద్యమం కొనసాగాలని భావిస్తారు. ప్రజలు తమ సొంత అనుభవం వల్లనే ఉద్యమ లక్ష్యాలను, వ్యూహం, ఎత్తుగడలను అర్థం చేసుకుంటారు, నమ్మకం పెంచుకుంటారు’ అనే జ్ఞానం అతివాదులకు ఉండదు. వీరు సకలజనుల సమ్మె, తెలంగాణ మార్చ్ సందర్భంలో మరింత తీవ్రమైన ఉద్యమానికి పిలుపునిస్తారు. ప్రజ ల చైతన్యస్థాయిని, సంసిద్ధతను అర్థంచేసుకోరు. ఎన్నికల సమయంలో ఉద్యమం ద్వారానే తెలంగాణ వస్తుందని, ఎన్నికలు పనికిరావని ప్రకటనలు గుప్పిస్తారు. తెలంగాణ రాష్ట్రం పార్లమెంటులో బిల్లుపెట్టడం ద్వారా పరిష్కారమయ్యే సమస్య అనే కనీస జ్ఞానాన్ని కోల్పోతారు.

రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధ ప్రక్రియ ద్వారా సాధించబడుతుందనే విషయాన్ని మర్చిపోతారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణబిల్లు పెట్టేలా ఒత్తిడి తీసుకరావడం, అందుకు జయశంకర్ సార్ చెప్పిన భావవ్యాప్తి, ఉద్యమం, ఎన్నికలు అనే మూడు పద్ధతులను అనుసరించాలి. మితవాదులు, అతివాదులలో ఒక పోలిక ఉంది అది ఏమిటంటే వీరు వాస్తవ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోరు. చైనా ప్రాచీన సైనిక వ్యూహకర్త సన్‌జూ చెప్పినట్లు ‘పోరుకు ముందు బుర్రలో లెక్కలు వేసుకోరు. పోరుకు ముందు బుర్రలో వేసుకునే లెక్కల్లో ఎవ్వడయితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడో వాడికే విజయం. అసలు ఏ మార్కులు రాకపోతే తిరుగులేని పరాజయానికి సూచన. అత్యుత్తమ ప్లాన్ తయారు చేసుకొని, పరిస్థితులకు అనుగుణంగా, సమర్థవంతంగా ప్లాన్ అమలు చేస్తే యుద్ధానికి ముందే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఏర్పడతాయి’ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేయడం ద్వారా ప్రజల నుంచి దూరమయ్యాయి. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కొంతమంది ప్రజాసంబంధాలు కొనసాగిస్తూ, ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తింపచేస్తూ, వారి పార్టీలను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు.


ప్రజలకు దూరమైన పార్టీలో క్రమశిక్షణ సాధ్యం కాదని లెనిన్ చెప్పారు. ప్రజలకు దూర మై, సరైన రాజకీయ నాయకత్వం, వ్యూహం ఎత్తుగడలు అందించలేని పార్టీలలో క్రమశిక్షణ అర్థంలేని చెత్తవాగుడు. మంత్ర, తాత్విక విద్యలాగా ఉంటుందని లెనిన్ తెలిపారు. క్రమశిక్ష ణ అనేది ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడిపడదు. దీర్ఘకాల పోరాటం ద్వారా సాధ్యమవుతుంది. వివిధ సందర్భాల్లో అతివాదులు, మితవాదులు ఉద్యమం నుంచి దూరమై చివరికి తెలంగాణ ద్రోహులుగా ప్రజల ముందు బహిర్గతమవుతారు. ఇంతకీ సరైన విధానం ఏమిటనే ప్రశ్న వస్తుంది. సందర్భానుసారం చేపట్టే నినాదం, అందుకు అవసరమైన వ్యూహం, ఎత్తుగడలు, వాటిని అమలు చేయకలిగిన యంత్రాంగం క్రమశిక్షణ మాత్రమే సరైన విధా నం. కేంద్రంలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి.


బీజేపీగానీ, కాంగ్రెస్‌గానీ ఒం టరిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేవు. సంకీర్ణ రాజకీయాలు, సంకీ ర్ణ ప్రభుత్వాలు అనివార్యం. ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకొని, తెలంగాణ సాధించాలంటే తెలంగాణ ఏకైక ఎజెండా కలిగిన టీఆర్‌ఎస్ పార్టీ వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు సీట్లు గెలవాలి. ఇందుకు అవసరమై న వ్యూ హం.ఎత్తుగడలనుఅనుసరించా లి. వివిధ ఉద్య మాలను చేపట్టాలి. ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’ ఉద్య మం ద్వారా తెలంగాణ ప్రజల సమైక్యశక్తిని చాటిచెప్పాలి. అదేవిధంగా ఆయా ప్రాంతాల, జిల్లాల స్థానిక సమస్యలపై ఉద్యమించాలి. టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతులను నియోజకవర్గాల వారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణ భావవ్యాప్తిని, తద్వారా ప్రజల్లో దృఢ సంకల్పాన్ని కలగచేయగలుగుతాం. నియోజక వర్గాల వారిగా, వేలమంది కార్యకర్తలను సమీకరించడం ద్వారా ‘ఐక్యతే బలం’ అనే విషయం ప్రజలకు అర్థం చేయించకలుగుతాం. అదే సమయంలో ప్రజలకు, కార్యకర్తలకు తమ సొంత అనుభవం ద్వారా విశ్వాసం పెంచగలుగుతాము.

తెలంగాణ సమాజం వివిధ వర్గాలుగా, వివిధ కులాలుగా ఉన్నది. అయితే సబ్బండ వర్ణాలను, వర్గాలను కలుపుకొని మహా ఉద్యమంగా కొనసాగడం ద్వారా, తెలంగాణ ప్రజలు ఐక్యమయ్యారు. కేసీఆర్ నిరాహారదీక్ష సకలజనుల సమ్మె వివిధ ఉప ఎన్నికల్లో పై విషయం స్పష్టంగా రుజవయ్యింది.అదేసమయంలో తెలంగాణ సమాజం వివిధ ఆంధ్ర పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీలకు చెందిన రాజకీయ నాయకుల ప్రాబల్యంలో ప్రజ లు కొంతవరకు ఉన్నారనేది వాస్తవం. సీమాంధ్ర పాలకవర్గాలు తెలంగాణ నాయకుల ద్వారా నే తెలంగాణ ప్రజలపై, టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై నీచంగా దాడి చేయిస్తున్నాయి.

సీమాంధ్ర పాలకవర్గాల ఎంగిలి మెతుకులకు ఆశపడి, ఈప్రాంత బానిస మనస్తత్వం కలిగిన నాయకులు, ఆంధ్రపార్టీల్లో అన్ని అవమానాలు భరిస్తూ తమకు ఎన్నడైనా మేలు జరుగుతుందని, తాము అందలమెక్కుతామని భ్రమపడుతున్నారు.పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు చేసే సేవలు, త్యాగాలు ఏమాత్రం ఉపయోగం లేనివని, ప్రజలకోసం చేసే త్యాగం మాత్రమే గొప్పవని మావో తెలిపాడు. ఆంధ్ర పార్టీల్లో ఎంత సేవ చేసినా గొప్పస్థానం పొందలేరు సరికదా, తెలంగాణ ప్రజల కోపానికి గురై శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరమవుతారు. తెలంగాణ ప్రజలకోసం ధర్మంకోసం, సత్యం కోసం పనిచేస్తే అధికారంతోపాటు ప్రజల ఆదరాభిమానాలు,శాశ్వత కీర్తిని పొందుతారు. ఆయా ఆంధ్ర పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి తెలంగాణ ఉద్యమ బలోపేతానికి కృషి చేయాలి. ‘గులామీ ఛోడో -గులాబీ బనో అనే నినాదాన్ని కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్, బీజేపీపార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు అర్థం చేసుకోవాలి.

గతంలో తాము తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను అవమానిం చామనే ఆత్మాన్యూన్యతా భావాన్ని వదిలి ఉద్యమంలోనికి రావాలి. తన బిడ్డలు చేసిన ద్రోహాలను, తప్పులను తెలంగాణ తల్లి క్షమించి తిరిగి అక్కున చేర్చుకుంటుంది. బుద్ధుడు చెప్పినట్టు స్వజనులతో సహవాసం వేసవిలో పచ్చనిచెట్టు కింద విశ్రమించడం లాగా మం చి అనుభూతినిస్తుందని తెలిపాడు. స్వజనులపై కత్తి దూయడం, తన అన్నదమ్ములపై దాడి చేయడం దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. పైగా తెలంగాణ సమాజం తెలంగాణ ద్రోహులను సహించి ఊరుకునే స్థితిలో లేదు. రాబోయే ఎన్నికల్లో ద్రోహులకు పరాజయం తప్పదు. అందుకే ఆంధ్రపార్టీల్లో పనిచేస్తున్న ఈ ప్రాంత నాయకులు ‘తక్షణం ఆయా పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లోకి, ఉద్యమంలోకి రమ్మని తెలంగాణవాదులు కోరాలి.

తెలంగాణ కోసం అశేష ప్రజానీకం సమైక్యంగా నిలపడ్డాలి. ఆంధ్రా పార్టీలలో పనిచేస్తున్న నాయకులంద రూ ఆయా పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లోకి రావాలి’ అనేది ప్రస్తుత తక్షణ నినాదం, ఈ నినాదాన్ని కొంతమంది నిబద్ధత కలిగిన మేధావులు సైతం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పన్నేండేళ్లుగా ఉద్యమపార్టీలో పనిచేస్తున్న వారికి పక్కనబెట్టి సీమాంధ్ర పార్టీల నుంచి వచ్చిన వారికి గుర్తింపు, సీట్లు ఇవ్వడం సమంజసం కాదని వాదిస్తున్నారు. పైకి చూస్తే పై వాదన సమంజసం లాగే అనిపిస్తుంది. సరిగ్గా విశ్లేషణ చేసుకుంటే పై వాదన తప్పని స్పష్టమవుతుంది. బైబిల్‌లో చెప్పినట్లు దారి తప్పిన గొర్రె పట్ల శ్రద్ధ చూపించడం తప్పు ఎంతమాత్రం కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం పూర్తిగా ఐక్యం కావాలి. ఐక్యతే బలమైన ఆయుధం. దీంతో సీమాంధ్ర పాలకవర్గాలను సులభంగా ఓడించి, తెలంగాణ రాష్ట్రం సాధించగలుగుతాం. బంగారు తెలంగాణ నిర్మించుకోగలుగుతాం.

100 అసెంబ్లీ, 16 పార్లమెంటు సీట్లు తద్వారా ఏర్పడే అధికార రాజకీయ హోదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఉద్యమంలో పనిచేసిన వారికి అనేక అవకాశాలు వస్తాయి. ఎవ్వరి కృషి, త్యాగం వృథాకావు. ప్రజలవైపు వచ్చినవారందరికీ స్వాగతంతోపాటు సముచిత స్థానం లభిస్తుంది. సీమాంధ్ర పాలక వర్గాలకు సేవచేయడం ద్వారా అధికారం, గౌరవం నశించి, ప్రజలతో ఛీత్కారం మాత్రమే పొందుతారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర మహాసంక్షిగామం. ఆ మహా సంగ్రామంలో కచ్చితంగా విజయం సాధించాలి. తద్వారా తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణలోని ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయా ఆంధ్ర పార్టీల నాయకుల పట్ల గులాంగిరి వదిలేయాలి. చేసిన పాపాల పట్ల ప్రాయశ్చితం చేసుకొనే అవకాశం వచ్చింది. ఉపయోగించుకోవాలి. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను విశ్వాసాన్ని చూరగొని, టీఆర్‌ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పురోగమిస్తున్నది. గెలుపు అనివార్యం. రాష్ట్ర ఏర్పాటు తథ్యం. అందుకు ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతినాయకుడు తమ వంతు పాత్ర నిర్వహించాలి.
-పెండ్యాల మంగళాదేవి
-వి. ప్రకాశ్ (రాజకీయ విశ్లేషకులు)
Courtesy:  Namasthe Telangaana

Sunday 5 May 2013

టైం మెశీను (Time Machine)



ఫేస్ బుక్కుల ఒక స్కూల్ మేట్ తోటి చాట్ చేస్తుంటే.. సూర్యాపేటల నా చిన్నప్పటి సరదా అల్లరి దినాలు మొత్తం యాదికొచ్చినయ్... ఆదిత్య 369 సినిమాల లెక్క... టైం మెశీను గనక ఉంటే అందుల ఎనకకి ప్రయాణం జేసి మల్లా ఓ సారి నా బాల్యం మొత్తాన్ని జీవించాలని అనిపిస్తాంది... కానీ ఏం లాభం మొన్ననే 3rd ఇయర్ పోరల్లకు పాఠం చెప్పుండే: "సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్సు ప్రకారం, కాలం ఎనకకు పోవుడు ససేమిరా కుదరదని"...

బచ్ పనాని మించిన మాధుర్యం లేనే లేదు... ఇంకా మేమైతే సాదా సీదా తెలుగు మీడియం స్కూల్ల సదివినం కాబట్టి... అస్సలు ఆ జిందగీకి హద్దులే లేవు... ముత్యాల వంటి కొన్ని జ్ఞాపకాలని ఒక దగ్గర చేరిస్తే మంచి హారం అయితది అనిపించింది (మీరు కూడా జర్ర గుర్తుకొచ్చినయన్నీ రాయండి)

ఇంటి పక్కన స్కూలున్నా.. లంచ్ బాక్సు పట్టుకపోయి దోస్తులందరికీ ఉన్నంతల పంచేది
ఆ తిన్నదంతా అరిగేదాంక.. అమ్మాయిలం అబ్బాయిలం కలిసి పిచ్చి బంతి మస్తు ఆడుతుండే
ఎవరి మీద ఎక్కువ కోపం వుంటే వానికి యమ తగిలేది ఆ బంతి..
ఆ బాల్యానికేం తెలుసు యవ్వనంలో అత్యాశ, ద్వేష దుర్మార్గ కామ దాహాలతో రగిలిపోతామని

ఆదివారం వస్తే చాలు పొద్దు పొద్దుగాలనే పొయ్యేది క్రికెట్ మ్యాచ్ ఆడనీకి.. అస్సలే 10 రూపాయల బెట్టింగు
చేతికో..కాలుకొ దెబ్బ తగిలిచ్చుకొని ఇంటికొచ్చేది...వాటి మీద ఇంట్లోల్లు ఇంకో నాలుగైదు తగిలిచ్చేటోల్లు
అమ్మయితే జర్ర కోపానికొచ్చి మల్ల గనక ఆడనీకి పోతే బ్యాటు పొయ్యిల పెడతా బిడ్డా అని బెదిరిచ్చేది
ఆ చిన్నతనానికేం తెలుసు.. పెద్దయితే సెలవు దినాల్లో కూడా యంత్రాల్ల పనిచేస్తామని....!!

ఇంకా నాకు బాగా గుర్తుంది ఏందీ అంటే.. సారుకు క్లాసుల కోపమొస్తే మమ్మల్ని క్వశన్లు అడిగేది
ఆన్సర్ తెల్వకపోతే ఆయన కొట్టినా బాగుండేది.. కాని సమాధానం చెప్పినోల్లతోటి కొట్టిపిచ్చేది...
పోరగాండ్లు కొడితే పర్లేదు.. కానీ అప్పుడప్పుడు అమ్మాయిలతోటి ముక్కు మీద చెంప దెబ్బలు పడేటియి..
ఇజ్జాత్ మానం మొత్తం మంటల కలిసినట్లు మస్తు ఫీల్ అయ్యేది.. ఇంగ ఇండియా-పాకిస్తాన్ యుద్ధమే
మల్లా అసొంటి చాన్సు దొరికితే ఇప్పటి TV సీరియల్ల రేంజుల.. రివేంజి అంతకు పది రెట్లు ఉండేది

మా ఇంట్ల దోస్తులందరం బంగ్లా మీంచి దుంకే ఆటాడేది
అప్పట్ల కాళ్ళు చేతులు ఇరుగుతాయ్ అనే ఫికరే ఉండకపోతుండే
చిన్నప్పుడు 1st ర్యాంకు వస్తే మా ఇంట్ల 5 రూపాయల క్వాలిటీ ఐస్ క్రీమ్ కొనిచ్చేది
అప్పటి ఆ ఆనందం నేటి ఏ అవార్డులు రివార్డులతో సరిపోదు..
ఇట్లా ఎన్నో మరెన్నొ.. రాస్తే రామాయణం అంత అయితది అనుకుంట

ఆడటం.. పాడటమ్.. నవ్వటం.. త్రుల్లటం.. ఏడ్చి ఏడ్చి అమ్మ దగ్గరికి పోవటం..
అమ్మ యెదలోపల అమృతాన్ని అనుభవించగల పుణ్యుడు, అనన్యుడు, అమాయకుడు
అఖిల లోకాల్లో అమలిన ఆనందాన్ని తన వశం చేసుకునే అమృతాన్ధసుడు --- బాలుడు

పసివాడు దేవుడంటే ఇదేనోమే, ఇంత స్వర్గానుభూతి దేవతలు కాని పొందలేరు
దైవత్వం పసితనాన మన మనసుల్లో ఉండి దేవతలుగా ఊగించి ఊగించి
యవ్వనం అనే యాంత్రికమైన నరజన్మలోకి అమాంతం ఇసిరేస్తుంది కొన్నాళ్ళకి

కృత్రిమాల కుడ్యాల చాటున కంపులో, ముళ్ళ కంపలలో సంతోషం ఉందని
భ్రమపడే మనందరికీ మళ్ళీ ఏనాటికైనా -- ఆ బాల్య దివ్య సౌధాగ్రాల కురిసే
ముత్యాల నవ్వుల చిరు జల్లులు మన జీవితంలో మళ్ళీ లభించేనా, లాభించేనా ??

నీడలు లేని మెత్తని వెన్నెలలలో, ముళ్ళు లేని మల్లె తీగల ప్రక్కగా
దుర్గంధం లేని మనస్సు కుల్యాజలంలో బాల్యం అనే నౌక మీద ప్రయాణం చేసే
దివ్య సమయాలు మళ్ళీ వచ్చేనా ? ఏమో !!

-- (చిన్నప్పటి) నిశాంత్